రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీ.ఆర్.ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత నామ
ఖమ్మం బ్యూరో, మార్చి 20(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రంజాన్ నెలకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు. రంజాన్ మాసం త్యాగం, నియమం, సేవా భావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ ఈ పవిత్ర మాసం మనిషిలో సహనం, కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ సంక్షేమం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి, ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేశారని ఈ సందర్భంగా నామ తెలియజేశారు. ముఖ్యంగా ముస్లిం సమాజం ఆర్థికంగా, విద్యా పరంగా వృద్ధి సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించినట్లు, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించినట్లు వివరించారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యా సహాయం, వృత్తి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. డ్రైవర్ ఎంపవర్మెంట్ (ఓనర్ కమ్ డ్రైవర్) పధకం కింద సబ్సిడీతో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకు కార్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా తాను ఎంపీ గా గెలిచిన రెండు సార్లు కూడా 15వ, 17వ లోక్ సభల్లో మైనార్టీల సమస్యలు పైన మాట్లాడటం తో ముస్లిం రిజర్వేషన్స్ విషయమై నాటి కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తీర్మానం ఆమోదించాలని పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసానని నామ గుర్తు చేసారు. నాటి బీఆర్ఎస్ పాలన లో మసీదుల అభివృద్ధి, దర్గాల సంరక్షణ, హజ్ యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారని నామ పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణుల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని నామ తెల్పడంతో పాటు రంజాన్ పర్వదినం ప్రతి ఇంట ఆనందం, ఆరోగ్యం, శాంతి, సంపద, శుభ ఫలితాలు నింపాలని నామ ఆకాంక్షించారు.


Comments