గ్రామ పంచాయతీ కార్మికుల గళమెత్తిన ఆందోళన.!
వేతనాలు నేరుగా ప్రభుత్వమే చెల్లించాలంటూ డిమాండ్.
సత్తుపల్లి, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం గ్రామ పంచాయతీ (జిపి) కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో వేంసూరు మండలంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేతనాలను నేరుగా ప్రభుత్వమే భరించాలని, ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు బుధవారం ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో జిపి కార్మికులు, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసిన చర్యలను ఖండిస్తూ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని తహశీల్దార్ మాణిక్‌రావుకు అందజేశారు.
తహశీల్దార్ స్పందిస్తూ కార్మికుల వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ, విధుల్లో ఉన్న కార్మికులందరినీ రాజకీయాలకు అతీతంగా పర్మినెంట్ చేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, భీమా సౌకర్యం కల్పించి ప్రీమియంను ప్రభుత్వమే భరించాలని కోరారు. అలాగే యూనిఫారాలు అందించడంతో పాటు అర్హులైన గుమస్తాలు, కార్మికులను జూనియర్ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలకు అనుమతి ఇచ్చి, అనంతరం రద్దు చేసి అరెస్టులు చేయడం కార్మిక హక్కుల ఉల్లంఘన అని ఆయన విమర్శించారు. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న గత పాలకులు అధికారాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పల్లెల్లో ప్రజారోగ్యాన్ని కాపాడే జిపి కార్మికులను నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్చలు జరపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చాట్ల దుర్గారావు,
అప్పారావు, శేషగిరి, దైద సుధాకర్, రమేష్, విజయభాస్కర్, రావూరి పుల్లయ్య, రామదాసు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


Comments