పులిగుండాల ప్రాజెక్టు నీటి విడుదలకు మంత్రి తుమ్మల ఆదేశం
Views: 45
On
• పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన
• తక్షణ స్పందనతో రంగంలోకి దిగిన మంత్రి
• యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన మంత్రి
ఖమ్మం బ్యూరో, మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)
పెనుబల్లి మండలం లోని పులిగుండాల ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్న రైతుల ఆవేదనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన మంత్రి, ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి సుమారు 1000 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రాజెక్టు పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో ఉన్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను గుర్తించి, రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల సమన్వయంతో వాటిని అత్యవసరంగా పరిష్కరించాలని స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీ.ఎఫ్.ఓ సిద్ధార్థతో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సాగునీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటి విడుదలను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పరిస్థితి అత్యవసరంగా ఉన్నందున ఫీల్డ్ స్థాయిలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతుల పంటలను ఎండిపోకుండా కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రతి రైతుకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పులిగుండాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలకు ప్రాణాధారం లభించనుందని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభిస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments