అంగన్వాడీ నాయకుల అరెస్టులకు నిరసనగా దమ్మపేటలో ధర్నా.
- ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్.
- అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ ఆందోళన.
- పెండింగ్ వేతనాలు, టీఐడీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి.
దమ్మపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న రాష్ట్ర నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ హామీని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని అడిగితే అది ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇస్తున్న కొద్దిపాటి వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, పని భారం మాత్రం విపరీతంగా పెంచి అంగన్వాడీలను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళనలు నిర్వహిస్తుంటే మహిళలు అని కూడా చూడకుండా అర్థరాత్రి ఇళ్లపైకి వెళ్లి అరెస్టులు చేయడం సరైంది కాదని అన్నారు. గతంలో పాలకులకు ఎదురైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికీ తప్పదని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు మాట్లాడుతూ అరెస్టు చేసిన అంగన్వాడీ రాష్ట్ర నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు రూ.18 వేల వేతనం అమలు చేయాలని, పెండింగ్ టీఐడీఏలు, సెంటర్ హద్దులు, గ్రాట్యుటీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామకృష్ణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు సూరమ్మ
, జ్యోతి, రాజ్యలక్ష్మి, శాంతి, అజిత, కవిత, వెంకటేశ్వరమ్మ, జయ, జానకి తదితరులు పాల్గొన్నారు.


Comments