అన్నప్రసాద వితరణలో నందనంపాటి రాముకు“అన్నదాన సేవా చక్రవర్తి”అవార్డు
కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
పేదలు, భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుతున్న ఈసీఐఎల్‌కు చెందిన సోలిస్ ఐ కేర్ సీఎండీ, తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ నందనంపాటి రామును ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సోమవారం ఈసీఐఎల్‌లోని సోలిస్ ఐ కేర్ హాస్పిటల్‌లో “అన్నదాన సేవా చక్రవర్తి” అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి పాల్గొని నందనంపాటి రామును అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందనంపాటి రాము సమాజంలో సేవా కార్యక్రమాలకు ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.పాండిచ్చేరిలోని తిరునల్లార్‌లోని ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో జరిగిన శని పేర్చి పవిత్ర ఉత్సవాల సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ మరియు సోలిస్ ఐ కేర్ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐదవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నందనంపాటి రాము పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆలయ 27వ పీఠాధిపతి మహా సన్నిధానం శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ చేతుల మీదుగా నందనంపాటి రాముకు “అన్నదాన సేవా చక్రవర్తి” అవార్డు ప్రదానం చేశారు. పేదలు, అవసరమైన వారికి అన్నప్రసాదం అందించడం ద్వారా ఆయన మానవతా విలువలను చాటుతున్నారని వక్తలు అన్నారు. సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సోలిస్ ఐ కేర్ సిబ్బంది విజయేందర్ రెడ్డి, మహేష్, విజయలక్ష్మి, భాస్కర్, గజేందర్, మోహన్, నీరజ తదితరులు పాల్గొని నందనంపాటి రామును అభినందించారు.


Comments