భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్.!
- జిల్లా కలెక్టర్‌తో సమావేశం.
- కీలక ప్రాజెక్టులపై దిశానిర్దేశం.
- నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి.
- భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు.
కొత్తగూడెం, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ అంకిత్‌తో మంత్రి సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే లైన్, పర్యాటక రంగం, రహదారి పనులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ప్రత్యేకంగా సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. “భక్తుల సేవలో ప్రభుత్వం” అనే నినాదంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. భక్తులు సౌకర్యంగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను మొత్తం రూ.300 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. తొలి విడతలో సుమారు రూ.100 కోట్లతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు, సెంటర్ లైటింగ్, పూల మొక్కల నాటకం వంటి సుందరీకరణ పనులను ఉగాది నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతాయని తెలిపారు. అలాగే యాతాలకుంట టన్నెల్‌లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం–మల్కానగిరి రైల్వే లైన్‌కు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూసేకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే లైన్ పూర్తయితే భద్రాద్రి ప్రాంతంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలోని బిపిఎల్, హెవీ వాటర్ ప్లాంట్లకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. భద్రాచలం, కొత్తగూడెం మధ్య అనుకూల ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. కొత్తగూడెం–భువనగిరి రహదారి పరిధిలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టుల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


Comments