సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.
- చెన్నై నోవహమో టెక్నాలజీస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.
- 66 మందిలో 17 మంది విద్యార్థుల ఎంపిక.
- సంవత్సరానికి రూ.3.4 లక్షల వేతనంతో నియామకం.
సత్తుపల్లి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని బి గంగారం గ్రామం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మరోసారి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రతిభ చాటారు. చెన్నైకు చెందిన నోవహమో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో కళాశాలకు చెందిన 17 మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో కళాశాల నుంచి మొత్తం 66 మంది విద్యార్థులు పాల్గొనగా, కంపెనీ నిర్వహించిన ఆన్‌లైన్ రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్, హెచ్‌ఆర్ రౌండ్, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా 17 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన వారిలో సీఎస్ఈ నుంచి 6 మంది, సీఎస్‌ఎం నుంచి 5 మంది, ఏఐ & డీఎస్ నుంచి 4 మంది, ఈసీఈ నుంచి 2 మంది ఉన్నారు. ఎంపికైన విద్యార్థులు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం పూర్తి అయిన వెంటనే చెన్నైలోని సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా విధుల్లో చేరనున్నారు. వీరికి సంవత్సరానికి రూ.3.4 లక్షల వేతనం అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి బండి అన్విద వర్చువల్‌గా విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో సబ్జెక్టు పరిజ్ఞానం మాత్రమే కాకుండా సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరమని చెప్పారు. విద్యార్థులు కళాశాలలో చదువుతున్నప్పుడే కొత్త నైపుణ్యాలను అభ్యసిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి.వి. కృష్ణారెడ్డి, వివిధ విభాగాధిపతులు, ప్లేస్‌మెంట్ ఇన్‌చార్జీలు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.


Comments