తల్లిదండ్రులను గౌరవించాలి… వృద్ధాశ్రమం ప్రారంభోత్సవంలో డా. చిన్నారెడ్డి పిలుపు
పెబ్బేరు,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్యన్ ఓల్టేజ్ హోం వృద్ధాశ్రమంను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2 తదితర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పట్టాలు అందజేసే కార్యక్రమంలో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.తల్లిదండ్రులను సరిగా చూసుకోని పక్షంలో వారి జీతాల నుంచి 10 శాతం మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పలుమార్లు పేర్కొన్నారని తెలిపారు.మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవిస్తేనే భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనలను గౌరవిస్తారని ఆయన అన్నారు.తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను చదివించి, జీవితంలో స్థిరపడేలా చేస్తారని, అలాంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం మహా పాపమని పేర్కొన్నారు.వృద్ధాశ్రమంలో నివసించే వృద్ధులకు మెరుగైన వైద్యసేవలు, మంచి భోజనం అందేలా చూడాలని ఆశ్రమ నిర్వాహకులు డి. శేఖర్‌కు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శేఖర్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.వృద్ధాశ్రమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చిన్నారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి నందిమల్ల యాదయ్య, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి మండల్ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, పెబ్బేరు మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ నాయుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి, కృపాకర్ రెడ్డి, ఎల్ల స్వామి, రాజు నాయక్, మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments