పిర్జాదిగూడలో గంజాయి పట్టివేత – ఒకరి అరెస్ట్
_1.3 కిలోల గంజాయి స్వాధీనం – మరో వ్యక్తిపై కేసు నమోదు
ఘట్కేసర్, మార్చ్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిర్జాదిగూడ–పర్వతాపూర్ రహదారిపై గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళ్తే, ఎస్టీఎఫ్ ‘ఏ’ టీం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం పర్వతాపూర్ రోడ్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కుమ్మరి గోపి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి సుమారు 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి మున్నా అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడిని తదుపరి విచారణ కోసం ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి వెల్లడించారు.గంజాయి విక్రయం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.


Comments