ప్రజాప్రతినిధులకు ఈనెల 12న శిక్షణ కార్యక్రమం
_99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించాలని
_సీఎస్ రామకృష్ణరావు ఆదేశాలు
మేడ్చల్–మల్కాజిగిరి,మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణా కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలు ఉండగా దాదాపు 15 వేల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను వేదిక వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారు.


Comments