ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో శ్రమదానం ఈ–వేస్ట్ సేకరణ
కాప్రా, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుషాయిగూడ డివిజన్‌లో పలు శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీఐఐసీ కాలనీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ప్రారంభించారు. సాయి సుధీర్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొని కాలనీ గ్రౌండ్ మరియు వీధులను శుభ్రపరిచి చెత్తాచెదారం, రోడ్ల పక్కన ఉన్న మట్టి కుప్పలు, రాళ్లు, చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ విభాగం సిబ్బంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అధికారి రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్ సుధీర్, రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఏలు శివకృష్ణ, కె.లక్ష్మి, కాలేజ్ ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జ్ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సేవాభావాన్ని డిప్యూటీ కమిషనర్ అభినందించారు.
అలాగే జై జవాన్ కాలనీ పార్కులో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. పార్కులోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, రాళ్లను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ మరియు కాప్రా ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు జ్యోతిష్మయ చారి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్, ఎన్‌ఎస్‌ఎస్ టీం సభ్యులు పాల్గొన్నారు.
ఇక వంపుగూడ డివిజన్ పద్మారావు నగర్ కాలనీలో ఈ–వేస్ట్ కలెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ప్రారంభించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కాలనీలో తిరిగి ఈ–వేస్ట్ సేకరించారు. మొత్తం 160 కిలోల ఈ–వేస్ట్‌ను సేకరించి రీకో ఏజెన్సీకి అందజేశారు. ఏజెన్సీ రేటు ప్రకారం కాలనీవాసులకు నగదు చెల్లింపులు చేశారు. ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అధికారి రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్ రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏలు వసంత, శిరీష, ఇన్‌చార్జ్ అంజలి మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించి ఈ–వేస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు.



Comments