గ్రీన్ చానల్ హామీలు ఎక్కడ?
- ప్రభుత్వం మాట తప్పిందని విమర్శలు.
- బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని వినతి.
దమ్మపేట, మార్చి 18(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో కార్మికులపై అదనపు భారంగా మారిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ విమర్శించారు. ఈ మెమోను తక్షణమే రద్దు చేసి, పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీడీవో రవీంద్రరెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, గతంలో పంచాయతీ నిధుల నుంచే వేతనాలు చెల్లించడంతో నిధుల కొరత ఏర్పడితే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. కొన్నిసార్లు నెలల తరబడి జీతాలు అందక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ‘గ్రీన్ చానల్’ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని, ఇందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీలు అమలు కాకుండా మళ్లీ పంచాయతీల ద్వారానే వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమని, కార్మికుల విశ్వాసాన్ని దెబ్బతీసేదని అన్నారు. గ్రామపంచాయతీల వద్ద సరిపడా నిధులు లేకపోవడంతో కార్మికులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాలు పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. కార్మికుల కడుపు నింపేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు రోజుకు ఒక్క పూట పని కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి భద్రత కల్పించాలని కోరారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి, రఘు, రామకృష్ణ, మల్లేశ్వరి, విజయలక్ష్మి, భవాని, యశోద తదితరులు పాల్గొన్నారు.


Comments