తెలంగాణ బడ్జెట్ 2026పై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ఆగ్రహం
_బీసీలకు తక్కువ నిధులు
– జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగుల్లో నిరాశ
_సబ్ ప్లాన్ గైర్హాజరు, హామీల అమలుపై ప్రశ్నలు
కాప్రా, మార్చి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు స్పందించిన బీసీ సంఘాల ప్రతినిధులు, ఈ బడ్జెట్ సామాజిక న్యాయం సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు.సుమారు రూ. 3.25 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్ర జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బీసీ వర్గాలకు కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు. ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 3.8 శాతం మాత్రమే ఉండడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగలేదని విమర్శించారు.ఇక బీసీల అభివృద్ధికి అత్యంత కీలకమైన బీసీ సబ్ ప్లాన్‌ను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం పట్ల వారు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇది బీసీ వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ నిరాశను మిగిల్చిందని అన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించకపోవడం వల్ల లక్షలాది మంది యువత ఆశలు తీరలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీపై కూడా ప్రభుత్వం మౌనం పాటించడం పట్ల వారు తీవ్రంగా స్పందించారు.విద్యా రంగంలో కూడా ఈ బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. గురుకుల పాఠశాలల్లో కనీస వసతుల కొరత, హాస్టల్ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోందని తెలిపారు.వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచిందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి.ముఖ్యంగా రైతు కూలీలు, చిన్న మరియు మధ్య తరగతి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కనిపించలేదని పేర్కొన్నారు.దళిత బంధు పథకంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుకు రూ. 12 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.ఈ నేపథ్యంలో, తెలంగాణలో ఉన్న సుమారు రెండున్నర కోట్ల బీసీలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, మేధావులు
ఈ బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


Comments