వనపర్తి పీజీ కళాశాలకు బాలుర, బాలికల హాస్టళ్ల మంజూరు
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకొని బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు.వనపర్తిలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పీజీ కళాశాలను మంజూరు చేసి నిర్మించుకున్నామని ఆయన గుర్తు చేశారు.అయితే అప్పటి నుండి పీజీ చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.ఇటీవల రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని చిన్నారెడ్డి తెలిపారు.ఈ విషయంపై వెంటనే స్పందించి పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తో చరవాణి ద్వారా మాట్లాడినట్లు ఆయన చెప్పారు. యూనివర్సిటీ గ్రాంట్స్ ద్వారా పీజీ బాలికల హాస్టల్‌కు 200 మంది విద్యార్థినుల కోసం రూ. 9.11 కోట్లు, పీజీ బాలుర హాస్టల్‌కు 150 మంది విద్యార్థుల కోసం రూ. 6.72 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.హాస్టళ్ల మంజూరుకు స్పందించి సహకరించిన పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పీజీ విద్యార్థుల చిరకాల కోరిక అయిన హాస్టల్ సౌకర్యం త్వరలోనే నిర్మాణం ప్రారంభమై నెరవేరుతుందని చిన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments