ఏడాది పూర్తి చేసుకున్న పెద్దమందడి ప్రెస్ క్లబ్
భవన మంజూరు కోసం ఎదురుచూపులు –
జర్నలిస్టుల్లో ఆత్మపరిశీలన
పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి ప్రెస్ క్లబ్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జర్నలిస్టులు తమ కార్యకలాపాలపై ఆత్మపరిశీలన చేపట్టారు.స్థానిక జర్నలిస్టుల ఐక్యత, వృత్తి పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ ఈ ఏడాది కాలంలో పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ముఖ్యంగా ప్రెస్ క్లబ్ భవన మంజూరు విషయంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినట్లు సభ్యులు అభిప్రాయపడ్డారు.ప్రెస్ క్లబ్ ఏర్పడిన వెంటనే జర్నలిస్టుల కోసం శాశ్వత భవనం అవసరమని గుర్తించిన సభ్యులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలుసుకొని వినతిపత్రాలు సమర్పించారు.అయినప్పటికీ ఇప్పటి వరకు భవన మంజూరుపై స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడం పట్ల జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ క్లబ్‌కు స్వంత భవనం ఉంటే జర్నలిస్టులు సమావేశాలు నిర్వహించడం, వృత్తి సంబంధిత చర్చలు జరపడం, ప్రజా సమస్యలను చర్చించి ముందుకు తీసుకువెళ్లడం సులభమవుతుందని సభ్యులు పేర్కొన్నారు.ఇకపోతే ప్రస్తుతం వార్తల విషయంలో కూడా పలు లోపాలు ఉన్నాయని కొందరు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై వచ్చే వార్తలు కొరవడగా, కొన్నిసార్లు నాయకుల మెప్పు కోసం వచ్చే వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.జర్నలిస్టులకు సరైన దిశా నిర్దేశం చేయడంలో కూడా లోపాలు ఉన్నాయని, సీనియర్ జర్నలిస్టులు జూనియర్లను సమన్వయం చేసుకొని ముందుకు నడిపించడంలో ఇంకా మెరుగుదల అవసరమని పేర్కొన్నారు.అదే విధంగా కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తరచుగా ప్రెస్ నోట్లు ఇవ్వకపోవడం కూడా గమనార్హమని చెప్పారు.కొందరికి మాత్రమే వ్యక్తిగతంగా వార్తలు పంపించడం వల్ల జర్నలిస్టుల మధ్య అసమానతలు ఏర్పడుతున్నాయని, ఇది ప్రెస్ క్లబ్ ఐక్యతకు అడ్డంకిగా మారుతోందని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో జర్నలిస్టులపై చులకన భావన ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అదనంగా ఎమ్మెల్యే సొంత మండలం అయిన పెద్దమందడిలో జర్నలిస్టులకు తగిన గుర్తింపు లభించడం లేదని స్థానిక రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పలు అధికారిక కార్యక్రమాలకు మండల స్థాయి జర్నలిస్టులను ప్రత్యేకంగా ఆహ్వానించడం లేదని, జిల్లా స్థాయి రిపోర్టర్లకు సమాచారం అందించినా మండల స్థాయి రిపోర్టర్లకు ఆశించిన స్థాయిలో సమాచారం ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఉదాహరణకు మంగళవారం పెద్దమందడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కార్యకర్తల విస్తృత సమావేశానికి మండలానికి సంబంధించిన రిపోర్టర్లను ఆహ్వానించలేదు. జిల్లాకు సంబంధించిన వారిని మాత్రమే ఆహ్వానించారని జర్నలిస్టులు మాపోతున్నారు. ఈ పరిస్థితులు కూడా స్థానిక జర్నలిస్టుల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.ఎమ్మెల్యే సొంత మండలం అయినప్పటికీ పెద్దమందడిలో ఇప్పటికీ ప్రెస్ క్లబ్ భవనం మంజూరుకాకపోవడం పట్ల జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేయడం ద్వారా వారి వృత్తి కార్యకలాపాలు మరింత సక్రమంగా కొనసాగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.ఇకపై జర్నలిస్టులు ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి, ప్రజల గొంతుకగా నిలవాలని పలువురు సూచించారు. ప్రెస్ క్లబ్ ఐక్యతను బలోపేతం చేస్తూ, జర్నలిస్టులకు సరైన దిశా నిర్దేశం చేసే నాయకత్వం అవసరమని సభ్యులు అభిప్రాయపడుతున్నారు.అలాగే ప్రెస్ క్లబ్ భవన మంజూరు కోసం సమిష్టిగా మరింత కృషి చేయాలని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.


Comments