గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన
నాచారం, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాచారం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు పి. గణేష్ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.యుద్ధాన్ని కారణంగా చూపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం సామాన్య ప్రజలపై మరింత భారాన్ని మోపడం అవుతుందని ఆయన అన్నారు.అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ గృహ అవసరాల గ్యాస్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్‌పై రూ.114 పెంచడం ప్రజలకు అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని విమర్శించారు. వెంటనే వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకుని ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.అలాగే ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధానికి దిగడం తగదని ఆయన అన్నారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కావని, శాంతి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత నెలకొని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో బాలరాజ్, ఎల్లేష్, నర్సింహా, సంజీవ్, పాండు, రాజయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments