కీసరలో భారీ భూ మోసం నకిలీ యజమానితో రిజిస్ట్రేషన్
ఐదుగురు అరెస్ట్ అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగింపు
కీసర, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ భూ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. మృతుడి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ యజమానిని సృష్టించి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాదను మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి మాదను ఇన్నయ్య 1988లో కుండనపల్లి చాముండిపట్నం టీపీఎస్ కాలనీలో ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. 2021లో ఆయన మరణించగా, స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొంతమంది దుండగులు ఈ మోసానికి పాల్పడ్డారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉప్పల వేణు, దొనపటి వెంకట రెడ్డి కలిసి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని నకిలీ యజమానిగా చూపించి, అతని కుమార్తె గుండిగ జ్యోతిని డబ్బు ఆశతో కుట్రలో భాగస్వామ్యం చేశారు. అనంతరం కీసర సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ సహకారంతో నకిలీ గిఫ్ట్ డీడ్ నమోదు చేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మార్చి 20న ప్రధాన నిందితులు ఉప్పల వేణు, దొనపటి వెంకట రెడ్డి, నకిలీ మాదను ఇన్నయ్య, గుండిగ జ్యోతి, ప్రసాద్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సబ్-రిజిస్ట్రార్ పాత్రపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.*ప్రజలకు సూచనలు:* భూమి కొనుగోలు సమయంలో అసలు యజమాని వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలి. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎంక్యూమ్బ్రెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) పరిశీలించాలి. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇటువంటి భూ మోసాలను నివారించవచ్చని పోలీసులు సూచించారు.


Comments