విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
నిధులు పెంచకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని స్పష్టం
కాప్రా, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ కాప్రా మండల్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా బడ్జెట్ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, బడ్జెట్‌లో విద్యార్థుల అవసరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినట్లు విమర్శించారు.విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది అని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉండటంతో బడ్జెట్‌లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 8 శాతం మాత్రమే కేటాయించడం ద్వారా విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఈ నిధులతో తీర్చడం అసాధ్యమని తెలిపారు. ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులు కొనసాగించలేకపోతున్నారని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు.ఇటీవల గురుకుల పాఠశాలల్లో జరిగిన ఆహార విషబాధ ఘటనలు విద్యార్థుల భద్రతపై ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయని విమర్శించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మెడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తిక్ మాట్లాడుతూ, “విద్య అనేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. కేటాయించిన నిధులు పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు బకాయిలను కూడా క్లియర్ చేయడానికి సరిపోవు” అని అన్నారు.మెడ్చల్ జిల్లాలో అనేక డిగ్రీ, ఇంటర్ కాలేజీలు షిఫ్ట్ విధానంలో నడుస్తున్నాయని, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.విద్యకు కనీసం 30 శాతం బడ్జెట్ కేటాయించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం ఎస్ఎఫ్ఐ కాప్రా మండల్ అధ్యక్షుడు శ్యామ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించగా, జిల్లా అధ్యక్షుడు అవినాష్, కార్యదర్శి కార్తిక్, సభ్యులు సాయి, నీరజ్, యశ్వంత్, అజయ్, మనిదీప్ తదితరులు పాల్గొన్నారు.


Comments