మీడియా పట్ల వివక్ష సరికాదు
– సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి
-డి.పి.ఆర్.ఓ ఎమ్.ఏ.గౌస్ కు టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్-2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టీ.ఎస్. చక్రవర్తి వినతి.
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
మీడియాను నిర్లక్ష్యం చేయరాదని, అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు సకాలంలో మంజూరు చేయాలని, గతంలో అక్రిడిటేషన్ పొందినవారికి రెన్యూవల్ ప్రక్రియను సులభతరం చేయాలని, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టిడబ్ల్యుజేఎఫ్ – హెచ్-2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి.ఎస్.చక్రవర్తి కోరారు. ఖమ్మం జిల్లా లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, టి.డబ్ల్యూ.జె.ఎఫ్ (హెచ్-2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎమ్.ఏ.గౌస్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వం– ప్రజల మధ్య కీలక వారధిగా పని చేస్తున్నారని తెలిపారు. అయితే అక్రిడిటేషన్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రకటనల విషయంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనల జారీలో చిన్న, మధ్య, పెద్ద పత్రికల మధ్య ఎలాంటి భేదభావం చూపకూడదని స్పష్టం చేశారు.
అలాగే చిన్న, మధ్యస్థాయి పత్రికలకు, ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రకటన బిల్లులను వెంటనే చెల్లించాలని, డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, భరోసా చర్యలు అమలయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో దరఖాస్తు చేసుకుని, పెండింగ్‌లో ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టుల సైట్‌ను రీ–ఓపెన్ చేసి, సీనియారిటీ నష్టపోతున్న అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కమిటీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ జర్నలిస్టు కార్డులు మంజూరు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇకనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తుందని టిడబ్ల్యూజెఎఫ్ హెచ్చరించింది. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి ఎమ్.ఏ. గౌస్ సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ ఖమ్మం జిల్లా సెక్రటరీ నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, టీ.బీ.జే.ఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా,కార్యవర్గ సభ్యులు అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, కప్పల మధు, కందరబోయిన నాగకృష్ణ, మామిడాల కిరణ్, పొదిలాపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Comments