అన్నపూర్ణ కాలనీలో ఉచిత మెడికల్ క్యాంప్
సీనియర్ సిటిజన్స్, మహిళలకు ఆరోగ్య సేవలు
మల్లాపూర్ ,సెప్టెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు):
మల్లాపూర్ డివిజన్,ఈస్ట్,అన్నపూర్ణ కాలనీ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ, సీనియర్ సిటిజన్స్ మరియు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత మెడికల్ క్యాంప్‌ను శనివారం రోజు విజయవంతంగా నిర్వహించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోషల్ జస్టిస్ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అండ్ డిసబిలిటీ ఆఫ్ పర్సన్స్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది.డా. షిఫా, నర్స్ శాంతి నేతృత్వంలో వైద్య సేవలు అందించగా, స్థానికంగా నివసిస్తున్న వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సుమారు వంద మందికి పైగా హాజరయ్యారు. బ్లడ్ ప్రెషర్ పరీక్షలు, షుగర్ టెస్టులు, ప్రాథమిక వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలు అందించారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేశారు.గత మూడు సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఈ మెడికల్ క్యాంప్‌ను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య సేవలు అందించడం సమాజానికి మనం ఇవ్వగల గొప్ప సేవ” అని కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.క్యాంప్‌కు ముఖ్య అతిథులుగా గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ఎన్ చౌదరి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.కార్యక్రమం సజావుగా జరిగేందుకు కాలనీ ప్రెసిడెంట్ డా. కటర్ల శేఖర్ బాబు నాయకత్వం వహించారు. “ప్రజల ఆరోగ్యం ముఖ్యమైనది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మరింత విస్తరించాలని, అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు.ఈ క్యాంప్‌ను స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎంతో ఆదరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
Comments