మేధస్సుతో ఆడే క్రీడ చదరంగం
లాలాపేట్, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులలో ఆలోచన శక్తిని పెంపొందించే క్రీడ చదరంగమని, ప్రతి పాఠశాలలో ఈ క్రీడను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. రామచందర్ రావు పిలుపునిచ్చారు.లాలాపేట్‌లో ఆదివారం ప్రారంభమైన “తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్ చెస్ టోర్నమెంట్” లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు క్రీడాకారులు కోనేరు హంపి, పెంటాల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకుని పిల్లలు చదరంగంలో రాణించాలని సూచించారు.కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ నిషా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకుడు శ్రీరామ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా మొత్తం 350 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. విజేతలకు ట్రోఫీలతో పాటు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతి అందజేయ బడుతుందని, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.చదరంగం కేవలం ఆట మాత్రమే కాకుండా మేధస్సును పదును పెట్టే విద్యగా భావించాలని, ఇలాంటి టోర్నమెంట్‌ల ద్వారా మరిన్ని అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు తయారవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments