కాజీపేట ఆర్ఓబి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటికే మొదటి వంతెన పనులు పూర్తయ్యాయని, రెండో వంతెన నిర్మాణం కొంత మేరకు పురోగమించిందని తెలిపారు. రైల్వే అధికారుల సూచనల మేరకు ఇనుప వంతెన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రెండో వంతెన పనులకు వేగం చేకూర్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పనుల్లో ఎటువంటి ఆలస్యం జరగకుండా, అనవసర జాప్యాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, పాత వంతెన మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.59 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి వంతెనను మరింత సురక్షితంగా, వినియోగయోగ్యంగా మార్చాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.తరువాత ఆయన స్థానిక ప్రజలు, సాంకేతిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాత వంతెన వద్ద మరమ్మత్తు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments