ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు
వేధింపులు మానుకోవాలని విజ్ఞప్తి
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆర్టిఐ చట్టం పేరుతో పాఠశాలలను వేధించడం తగదని, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టిఐ చట్ట పరిధిలోకి రావని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు నడిపెల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ, “ప్రైవేట్ పాఠశాలలు లాభాపేక్ష లేకుండా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను ప్రభుత్వ నియమావళి ప్రకారం అమలు చేస్తున్నాం,” అని తెలిపారు.
ఇప్పటికే విద్యార్థుల సంఖ్య, ఫీజు వివరాలు వంటి అంశాలు యూ–డైస్ దత్తాంశంలో నమోదు చేసినట్లు వివరించారు. అంతేకాక 03.11.2025 తేదీతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు (డబ్ల్యూ.పీ. నం. 25772/2014) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ చట్ట పరిధిలోకి రావని స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేశారు.“ఈ తీర్పు నేపథ్యంలో ఆర్టిఐ పేరుతో పాఠశాలలపై జరుగుతున్న వేధింపులు తక్షణమే నిలిపివేయాలని అధికారులను కోరుతున్నాం,” అని సుధీర్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, పుష్కూరి కార్తీక్ రావు, రాజన్న, శివ, రాఘవచారి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments