కేటీఆర్ నీ చెల్లి కవిత అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పు!
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పరిపాలన, వైద్య సేవలే మా లక్ష్యం –
స్టేషన్ ఘనపూర్, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
“కేటీఆర్ అధికారం కోల్పోయినా అహంకారం మాత్రం కోల్పోలేదు...!”
అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ —
“ప్రజలు అధికారాన్ని దూరం చేశారు కానీ కేటీఆర్‌లోని అహంభావం మాత్రం ఇంకా తగ్గలేదు. రోజూ మైక్ పట్టుకుని అసత్య ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. ముందు నీ చెల్లి కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు కేటీఆర్!” అని సవాల్ విసిరారు.
నవంబర్ 2026 నాటికి రెండు భారీ నిర్మాణాలు పూర్తి
స్టేషన్ ఘనపూర్ పట్టణంలో జరుగుతున్న ఇంటిగ్రెటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను కడియం శ్రీహరి పరిశీలించారు.
అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై, పనులను నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

“నవంబర్ 2026 నాటికి ఈ రెండు భవనాలను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తాం. వైద్య సిబ్బంది, పరికరాలు, వసతులు – అన్నీ సిద్ధం చేస్తాం. భవనం మాత్రమే కాదు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండాలి” అని స్పష్టం చేశారు.
1400 కోట్లు – 18 నెలల్లో పూర్తి ప్రణాళిక
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అడిగిన వెంటనే మా నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. 18 నెలల్లో ఆ అభివృద్ధి పనులు పూర్తవుతాయి. వందలాది రహదారులు, కార్యాలయాలు, ఆస్పత్రులు, మౌలిక వసతులు రూపుదిద్దుకుంటాయి” అని తెలిపారు.
కొంతమంది అభివృద్ధి పనులకు అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తూ, “ఇలాంటి వారిని ప్రజలు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి అంటే మాటల్లో కాదు – మైదానంలో కనిపించాలి!” అని కడియం హెచ్చరించారు.
కేటీఆర్ అహంకారం తెలంగాణ ప్రజలే చెదరగొడతారు
కేటీఆర్‌పై తన దూకుడు కొనసాగిస్తూ కడియం శ్రీహరి అన్నారు:
“తెలంగాణ ఉద్యమం పేరిట ప్రజల నమ్మకాన్ని వాడుకున్నారు. ప్రజలు రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు – కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం తెలంగాణను పీక్కుతిన్నది.”
“తెలంగాణ ఏర్పాటుకు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా కేటీఆర్?” అని ప్రశ్నించారు.
“తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు కష్టపడ్డారు – కానీ మీరు మాత్రం లాభాలు చూసుకున్నారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకే నీపై నమ్మకం లేదు కేటీఆర్! ముందుగా నీ ఇంటి వ్యవహారం సరిచేసుకుని, ఆ తర్వాత ఇతరులపై విమర్శలు చెయ్యి,” అని సూటిగా దెబ్బకొట్టారు.
ప్రజల కోసం, అభివృద్ధి కోసం, నిబద్ధతతో ముందుకు
“మా పని ప్రజల కోసం. పాలన అంటే మాటలు కాదు – కట్టడాలు, ఆస్పత్రులు, సౌకర్యాలు, పథకాలు ఉండాలి. కేటీఆర్‌లాంటి అహంకారులు కాదు, సేవకు అంకితమైన నాయకులు కావాలి” అని కడియం అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డీవో, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments