ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు
— ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ మండల అధ్యక్షుడి ఆగ్రహం
-“రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు”
— మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల ఐకేపీ కేంద్రాలను సందర్శించిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విని ఆవేదన వ్యక్తం చేశారు.పది రోజులుగా వడ్లను నిల్వ ఉంచినా మిల్లులకు కేటాయింపు లేకపోవడం, కొనుగోలు ప్రారంభం కానందున రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, వడ్లపై కప్పేందుకు తార్పాలిన్ పరదాలు అందించకపోవడం వల్ల తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. “ఈ అకాల వర్షాల వల్ల వడ్లు చెడిపోతున్నాయి. రైతుల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎలా చెప్పుకుంటుంది?” అని శ్రీకాంత్ యాదవ్ ప్రశ్నించారు.
ఎల్కతుర్తి యార్డు ఐకేపీ కేంద్రంలో సుమారు 20 లక్షల గన్నీ సంచులు ఉన్నప్పటికీ వాటిని రైతులకు ఇవ్వడం లేదని, అక్టోబర్ 25న కేంద్రం ప్రారంభించినప్పటి నుండి ఒక్క క్వింటాల్ వడ్లను కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
మిల్లుల కేటాయింపులో జాప్యం కమిషన్ బేరం కుదరకపోవడమేనా అని ప్రశ్నించిన ఆయన, “రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప ప్రభుత్వం స్పందించదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం చెల్లించి, వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“ఇలాగే కొనుగోలులో జాప్యం కొనసాగితే రైతులతో కలిసి రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తాం,” అని హెచ్చరించారు.ఈ సందర్శనలో బీజేపీ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగాం కిష్టయ్య, కోడం రమేష్, ఠాకూర్ సామ్సంగ్, అంబిర్ శ్రీనివాస్, అల్లికుమార్, దాసరి సాయి తేజ, బాడిశే కుమారస్వామి, మంతుర్తి తిరుపతి యాదవ్‌తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.


Comments