తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా హింగే భాస్కర్
ఎల్కతుర్తి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
తుఫాన్ కారణంగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ప్రభుత్వం తగిన సాయం అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా,ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ అన్నారు.ఆదివారం ఆయన రైతు రక్షణ సమితి బృందంతో కలిసి ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకొని, పొలాల్లోని నష్టాన్ని స్వయంగా చూశారు. పొలాటి సంపత్ రావు అనే రైతు 10 ఎకరాల్లో పంట నష్టం, రాజేశ్వరరావు 5 ఎకరాల వరి పంట వాగులో కొట్టుకుపోవడం వంటి ఘటనలను పరిశీలించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.10 వేల పరిహారం రైతుల నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేదని ఆయన పేర్కొన్నారు. కనీసం ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, పంట బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన వడ్లను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.రైతుల కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరంగా పోరాటం చేస్తుందని, రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం అవుతుందని హింగే భాస్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు ఇరువాల సాంబయ్య, బుగ్గ బాబు, చల్లూరి వేణు, సారయ్య, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments