క్యాన్సర్‌పై అవగాహన – ఆరోగ్యమే ఆభరణం!
ఎమ్మెల్యే జారె ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం విజయవంతం
అశ్వారావుపేట, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం గురువారం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఉదయం 9 గంటల నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పురుషులు, మహిళలు, వృద్ధులు, ముఖ్యంగా పొగాకు, మద్యం సేవించే వారు ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు క్యాన్సర్‌కు దారితీసే అలవాట్లు, ప్రారంభ లక్షణాలు, నివారణ మార్గాలు వంటి విషయాలను ప్రజలకు వివరించారు.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, “అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రక్షణే మా ప్రధాన లక్ష్యం. ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా సమయానికి వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం” అన్నారు. ప్రజల ఆరోగ్యమే అభివృద్ధికి మూలస్థంభమని పేర్కొన్నారు.
ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధన్యవాదాలు తెలిపారు.


Comments