సింగరేణి జె.వి.ఆర్ గనిని పరిశీలించిన పర్యావరణ, అటవీ శాఖ బృందం.
గని నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు
సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక జలగం వెంగళరావు, కిష్టారం సింగరేణి ఉపరితల గనులను పర్యావరణ, అటవీ శాఖల సంయుక్త బృందం మంగళవారం సందర్శించింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రతినిధి ప్రొఫెసర్ ఆర్.ఎం. బట్టచార్జీ, సింగరేణి పర్యావరణ విభాగం ప్రధాన మేనేజర్ సైదులు, కొత్తగూడెం ప్రాంత ప్రధాన మేనేజర్ శాలెం రాజుతో కలిసి గనిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గని కార్యకలాపాలపై వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. గని ప్రాంతంలో కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలను బట్టచార్జీ ప్రశంసించారు. బొగ్గు దుమారం నివారించడానికి నీటిని వెదజల్లడం, విస్తృతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు సమర్థవంతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇచ్చి, గని పరిసర గ్రామాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు సూచించారు.
పరిశీలన కార్యక్రమంలో జె.వి.ఆర్ గని ప్రాజెక్ట్ అధికారి ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్, ఏరియా అధికారి కోటిరెడ్డి, రాజేశ్వరరావు, కళ్యాణ్ రామ్, పర్యావరణ విభాగం అధికారులు రవికిరణ్, పి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments