చీర్యాల డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి త్వరలో ఇంటి నెంబర్లు
మూడు వారాల్లో అందజేస్తామని కమిషనర్ వెంకట్‌రెడ్డి హామీ
దమ్మాయిగూడ, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మౌలిక వసతుల సమస్యలు అధికమై ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో సంవత్సరాలుగా డ్రైనేజీ, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సదుపాయాలు అందుబాటు లో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. ఇంటి పట్టాలు అందించినా, ఇంటి నెంబర్‌లు ఇవ్వకపోవడంతో రాత్రి వేళల్లో అసౌకర్యాలు ఎదురవుతున్నాయి, చీకట్లో ప్రమాదాల భయంతో జీవిస్తున్నామని వారు విన్నవించారు
.ఈ సందర్భంగా కాలనీ వాసులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడును తెలియజేశారు. సమస్యలపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ లక్ష్యం ప్రతి కాలనీకి మౌలిక వసతులను కల్పించడం అని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఉన్న లోపాలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఇంటి నెంబర్‌లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్, మూడువారాల్లో కాలనీలో అన్ని ఇండ్లకు నెంబర్‌లు కేటాయిస్తాం అని స్పష్టం చేశారు. తదుపరి డ్రైనేజీ, తాగునీరు, రహదారులు వంటి వసతుల మెరుగుదలపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.కమిషనర్ హామీతో కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కొల బాల్ రాజ్ యాదవ్, నేతలు బోడ శ్రీనివాస్, రమేష్ గౌడ్, కాలనీ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.


Comments