సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ కేడల ప్రసాద్ నియామకం
వరంగల్,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ జిల్లా ఖిల వరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన సామాజిక వేత్త డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్‌ను సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కేడల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు రూపుమాపడానికి సమాచార హక్కు చట్టం ప్రజలకు బలమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రజలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటే సమాజంలో పారదర్శకత నెలకొంటుందని తెలిపారు. అవినీతి, అక్రమాలను వెలికితీసి న్యాయస్థానాల ద్వారా అరికట్టడమే కాకుండా, నిరుపేదలకు న్యాయసలహా, సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, పేదలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయడం, అన్ని శాఖల్లో ఆర్టీఐ చట్టం పూర్తి స్థాయిలో అమలయ్యేలా పర్యవేక్షించడం కమిటీ ముఖ్యమైన విధానాలుగా వివరించారు. విద్యా, వైద్య రంగాల్లో ఉన్న లోపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రమాణాలు మెరుగుపరచడం, మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించడం, ప్రజా ఆస్తులను కాపాడడం కూడా కమిటీ కర్తవ్యమని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరూపించి దోషులను వెలుగులోకి తేవడమే కాకుండా రాజీ లేని పోరాటం సాగిస్తామని ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల లెక్క తేల్చి ప్రజా ఆస్తుల రక్షణకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ సంస్థ ఎటువంటి రాజకీయ పార్టీకి లేదా ఇతర సంస్థలకు అనుబంధం కాదని, మానవ హక్కులను కాపాడడం, మానవ సంబంధాలను మెరుగుపరచడం, మానవత్వాన్ని పంచడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మిత్రులు ఆయనను అభినందించారు.


Comments