మధిర లోతట్టు ప్రాంతాల వరద ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు......
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, నవంబర్ -1, తెలంగాణ ముచ్చట్లు;
వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మధిర పట్టణం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వర్షం కురిసినప్పుడు జలమయం అయ్యే కాలనీలు, వరద ఇబ్బంది పడే లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. మధిర మున్సిపాలిటీలోని హనుమాన్ నగర్, ముస్లిం కాలనీ లను క్షేత్రస్థాయిలో కాలినడకన తిరిగుతూ వరద ప్రభావ పరిస్థితులను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల వరద ముంపుకు శాశ్వతంగా సమస్యలు పరిష్కారానికి టౌన్ మ్యాప్ లను పరిశీలిస్తూ అధికారులకు అదేశాలు ఇచ్చారు. స్ధానిక ప్రజలతో కలెక్టర్ మాట్లాడి, వర్షం తో జరిగే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్డు వెడల్పు పెంచాలని ప్రజలందరూ దీనికి సహకరిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని తెలిపారు.
అనంతరం మధిర మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ ఆర్&బీ, మున్సిపల్ అధికారులతో పట్టణ అభివృద్ధి పనులు, శానిటేషన్, వరద లోతట్టు ప్రాంతాల పరిరక్షణ పై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
మధిర పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. మధిర పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్ కు తరలించాలని, రహదారుల వెంట చెత్త కనిపించడానికి వీల్లేదని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మధిర పెద్ద చెరువు ట్యాంకుల ఏర్పాటు, పటిష్ట కాల్వర్టర్ల నిర్మాణం స్టామ్ వాటర్ సైడ్ డైన్ లు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వరద నీరు వెళ్లిపోవడానికి మున్సిపల్ అధికారులు రూపొందించిన డ్రైనేజీ ప్రణాళికలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డిఇ నాగబ్రహ్మం, ఆర్&బీ డిఇ శంకర్, మధిర మండల తహసీల్దార్ రాంబాబు, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments