అప్పారావుపేటలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం.
ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఘనంగా.
అశ్వారావుపేట, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలం అప్పారావుపేటలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఆదివారం ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులతో ఆత్మీయంగా చర్చించారు. ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులు హాజరయ్యారు.
రైతులతో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ రంగంలో గేమ్‌చేంజర్‌గా ఆయిల్ పామ్ సాగు నిలుస్తోందని, త్వరలోనే తెలంగాణ దేశానికి ఆయిల్ పామ్ హబ్‌గా మారబోతోందని అన్నారు. ఆయిల్ పామ్ సాగు వలన దేశానికి అవసరమైన వంట నూనెల దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం, ఈ పరిస్థితిని మార్చే సామర్థ్యం మన రైతుల్లోనే ఉంది అని మంత్రి అన్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రూట్ బంచ్ క్రషింగ్ సాధించిన ఆయిల్‌ఫెడ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అప్పారావుపేట ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) పామాయిల్ గెల్లల ధర నిర్ణయానికి దేశస్థాయి బెంచ్‌మార్క్‌గా మారిందని తుమ్మల తెలిపారు.
రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. రసాయన ఎరువులు, యూరియా అధికంగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారులు విస్తరిస్తున్నాయని, పంజాబ్‌లా తెలంగాణ కూడా ఆ పరిస్థితి రాకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పురుగుమందులు, ఎరువుల విచ్చలవిడిగా వినియోగం అనేక రకాల వ్యాధులకు కారణమవుతోందని, రైతాంగం సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని తుమ్మల పిలుపునిచ్చారు.


Comments