ఉల్లాసంగా ఉత్సాహంగా స్మార్ట్ కిడ్జ్ వన సమారాధన
-చిన్నారుల నృత్యాలతో హోరెత్తిన వన ప్రాంగణం
-ఆకట్టుకున్న మ్యాజిక్ షో
ఖమ్మం బ్యూరో ,నవంబర్ 1, తెలంగాణ ముచ్చట్లు:
ఉరకలేసే ఉత్సాహంతో స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు స్థానిక చెరుకూరి మామిడి తోటలో శనివారం నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన అందరిలో ఉల్లాసాన్ని నింపింది. నృత్యాలతో వన ప్రాంగణం హోరెత్తింది. సంతోషంగా చిన్నారులు నిర్వహించిన పలు రకాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రోజంతా పాఠశాల చిన్నారులు వనంలో గడిపి స్నేహ బంధాన్ని చాటారు. పుస్తకాలతో బిజీబిజీగా రోజుల తరబడి కాలం గడుపుతున్న పాఠశాల చిన్నారులకు ఆటవిడుపుగా నిర్వహించిన వన సమారాధన విద్యార్థులలో మరింత హుషారుని నింపింది. అల్లరి చేస్తూ, కేకలేస్తూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరిస్తూ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. జానపద, సాంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలతో వన ప్రాంగణ వేదికపై తోటి మిత్రులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మ్యాజిక్ కళాకారులునిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శన అందరిలో సంభ్రమాశ్చర్యాలను నింపింది.
తమ కళ్ళముందే పలు రకాల వస్తువులు మాయమై కొత్త వస్తువులు దర్శనం ఇవ్వడం విద్యార్థులను మరింతగా అబ్బురపరిచింది. ఈ సందర్భంగా వన ప్రాంగణ వేదికపై పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వనాలు మనం జీవించడానికి ప్రాణవాయువును అందిస్తున్నాయని అందుకే చెట్లను దేవతలుగా భావించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వన సమారాధనతో విద్యార్థులలో స్నేహబంధం, సహకారం, ఇతరుల పట్ల సంఘీభావం, ఆటపాటల విన్యాసాలు ప్రతి ఒక్కరికి పొంగే ఉత్సాహాన్ని అందిస్తున్నాయని తెలిపారు. రోజుల తరబడి పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆటవిడుపుగా కార్తీక వన సమారాధన నిర్వహించడం ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సాంప్రదాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments