పేదల సమస్యలకు పరిష్కారం కావాలి.
సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన సిపిఐ(ఎం) నాయకులు.
సత్తుపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, స్థానిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పేదలు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాకర్లపల్లి గ్రామ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను సింగరేణి మట్టితో పూడ్చి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఇరుకైన గదుల్లో జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. బోడు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న కోనేరు (నీటి కుంట)ను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.
పైన తెలిపిన సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌కి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటానని, కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తారని ఆయన హామీ ఇచ్చారు.
తరువాత ఎన్ఎస్పీ బస్టాప్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, మండల కమిటీ సభ్యులు అయినంపూడి సనందన్‌రావు, కువారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, బెజవాడ లక్ష్మీనారాయణ, కిష్ట లక్ష్మి, రజియా, యాకుబ్ పాషా, వారాల కుమారి, కొనపాకుల రాజు, బొమ్మన బోయిన భాగ్యలక్ష్మి, ఎర్రగొర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments