ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం… రైతుల ఆవేదన వ్యక్తం.

కొత్త నిబంధనలు రైతులకు భారంగా మారాయి – మిల్కూరి వాసుదేవ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం… రైతుల ఆవేదన వ్యక్తం.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
 
రాష్ట్రంలో రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా సాగుతుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఐకెపి, ప్యాక్స్, డీసీఎంఎస్, హాకా సంస్థల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, కొనుగోళ్లలో వేగం లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి విమర్శించారు.
బుధవారం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఉన్న ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలే లేకపోవడం రైతుల సమస్యలను మరింత పెంచుతోందన్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడం, నీడ కోసం టెంట్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో కాటాలు వేయకపోవడం వల్ల రైతులు పక్షం రోజులుగా తమ ధాన్యాన్ని కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మబ్బులు కమ్ముకొస్తే ధాన్యాన్ని కుప్పలుగా వేసి మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోందని చెప్పారు.
జిపిఎస్ ట్రాకింగ్, రియల్ టైం డాటా ఎంట్రీ వంటి కొత్త విధానాలు పారదర్శకత కోసం తీసుకొచ్చినా, ప్రస్తుతం రైతులకు భారంగా మారాయని విమర్శించారు. ఈ నిబంధనల కారణంగా కొనుగోళ్లు మరింత ఆలస్యమవుతున్నాయని అన్నారు.
ఇక లారీలు, ట్రాక్టర్లు, బొలెరో వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయడానికి రూ.3000 నుండి రూ.5000 వరకు ఖర్చు అవుతుండటంతో వాహన యజమానులు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.
జిల్లాలో సుమారు 100 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, కేవలం 14 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రబీ సీజన్‌లో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 10 వేల టన్నుల లోపే కొనుగోలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పాత విధానంలోనే కొనుగోళ్లు చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టరేట్, మంత్రి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు శీలం అశోక్, కాయిత లింగారెడ్డి, రాజిరెడ్డి, కస్తూరి రవి, బండి ఓదెలు, వరికల రాజేశ్వరరావు, సింగవేన కుమారస్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .