అధికారులు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
డా.జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాసేవకు, నిష్కపటతకు ప్రతీకగా నిలిచిన ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ జీవితం ప్రతి అధికారికి ఆదర్శంగా ఉండాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.
ఎస్.ఆర్. శంకరన్ 91వ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణ గ్రీన్‌పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ..
శంకరన్ తమిళనాడులోని తంజావూరు గ్రామంలో జన్మించి విద్యాపట్ల ఉన్న ఆసక్తితో ఉన్నత విద్యను పూర్తిచేసి కేవలం 22 ఏళ్లకే ఐఏఎస్ అధికారి అయ్యారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదిలాబాద్, ఖమ్మం, నెల్లూరు జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి విశేష సేవలందించారని పేర్కొన్నారు.
కలెక్టర్‌గా ఉన్న సమయంలో తన జీతాన్ని కూడా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగించిన గొప్పమనస్కుడని తెలిపారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో నక్సలైట్ సమస్య పరిష్కారానికి శంకరన్ నేతృత్వంలో శాంతి చర్చలు జరిపిన విషయం గుర్తుచేశారు.ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన శంకరన్ గారు సామాజిక సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఉచిత విద్యావకాశాలను కల్పించారని తెలిపారు. పద్మభూషణ్ వంటి అత్యున్నత పౌర గౌరవాన్ని కూడా స్వీకరించకుండా నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అవినీతి మచ్చ లేకుండా కలెక్టర్, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయిల్లో నిజాయితీగా సేవలందించిన శంకరన్ ను ఆదర్శంగా తీసుకుని నేటి అధికారులు ప్రజల సేవలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, ఏఐపిసిసి ఉపాధ్యక్షులు నాగార్జున, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోహిత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, యూత్ నాయకులు ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ ప్రేమ్‌నాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజిరెడ్డి, వాకిటి బాలరాజ్, కోళ్ల వెంకటేష్, జానంపేట నాగరాజు, ఎంట్ల రవి, రామ్‌సింగ్ నాయక్, మన్యం యాదవ్, అబ్దుల్లా, నందిమల్ల రాము, లక్ష్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments