బుగ్గపాడు గ్రామ సమస్యలపై డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలన.!
సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ స్వయంగా పరిశీలించారు. మంగళవారం ఆయన బుగ్గపాడు, గాంధీనగర్ కాలనీ, నేపాల్ కాలనీ ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
గాంధీనగర్ కాలనీ లో ఆదివాసీ కుటుంబాల నివాసాల్లో సహచరులు, కాంగ్రెస్ నాయకులు కిసర రాంబాబు, స్థానిక కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం గ్రామంలో సిదిలమైన స్థితిలో ఉన్న క్లస్టర్ భవనం ను ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు.
గ్రామంలోని పలు ఇళ్లలో స్లాబుల నుంచి నీరు కారడం, పేదలకు స్థలాల కొరత వంటి సమస్యలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. అలాగే బుగ్గపాడు, గాంధీనగర్ కాలనీలలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను కూడా పరిశీలించారు.
ఏళ్ల తరబడి పరిష్కారం కాని పోడు భూముల వివాదాలపై రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు సరైన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని డాక్టర్ దయానంద్ సూచించారు.
బుగ్గపాడు గ్రామ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సహకారంతో, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని దయానంద్ తెలిపారు.


Comments