చిన్నారుల ఆకలి తీర్చిన అంగన్వాడిలు
అభినందించిన మంత్రి సీతక్క
హన్మకొండ,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండలోని సమ్మయ్యనగర్, అమరావతినగర్, టీవీ టవర్ ప్రాంతాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కష్టకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల నుండి రక్షించబడిన చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు.పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు స్వయంగా వేడి వేడి బాలమృతం వండి చిన్నారులకు అందించారు
మంగళవారం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించినప్పటికీ, సిబ్బంది విధుల్లోనే కొనసాగి వరద ప్రభావిత ప్రాంతాల్లో పిల్లల బాగోగులు చూసుకున్నారు. వారు తమ సొంత వనరులతో వండిన ఆహారాన్ని ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లి చిన్నారులకు వడ్డించారు.
అంగన్వాడీ సిబ్బంది చూపిన ఈ మానవతా దృక్పథంతో కూడిన సేవాభావాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అభినందించారు. “అవసర సమయంలో ప్రజల కోసం అంగన్వాడీలు ముందుకు రావడం, చిన్నారుల ఆకలి తీర్చడం గొప్ప సేవ” అని ఆమె ప్రశంసించారు. అంగన్వాడీ వ్యవస్థ సామాజిక సేవలో ఒక కాంతి దీపంలా నిలుస్తోందని పేర్కొన్నారు.
మోంథా తుఫాన్ నేపథ్యంలో కూడా అంగన్వాడీ సిబ్బంది చూపిస్తున్న నిబద్ధత, సేవా మనోభావం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా అభినందనలు తెలియజేశారు


Comments