రిటైర్మెంట్ బకాయిలు రాక మనోవేదనతో మృతి.
మరణించిన వారికి నివాళి.
- విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతల ఆవేదన.
సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగ విరమణ చేసినా, ప్రభుత్వంచే రావలసిన ఆర్థిక ప్రయోజనాలు అందక మనోవేదనకు గురై బలవన్మరణం చెందిన విశ్రాంత ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు నివాళి ఘటించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో కొవ్వత్తులు వెలిగించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి ప్రకాశరావులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విశ్రాంత ఉద్యోగులకు బకాయీలు, పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడం వల్ల పలువురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్సకు నిధులు లేక ఇబ్బంది పడుతుండగా, కొందరు తీవ్ర మనోవేదనతో ప్రాణాలు త్యజించడం బాధాకరమని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 21వ అధికారం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నదని గుర్తుచేసి, విశ్రాంత ఉద్యోగుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టులు అనేకసార్లు ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం కు ఆదేశించినా, అవి అమల్లోకి రాకపోవడం దురదృష్టకరమన్నారు. కోర్టు తీర్పులను వెంటనే అమలు చేసి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, డి.కృష్ణయ్య, బి.దాసు, నర్సయ్య, సాంబశివరెడ్డి, మల్లికార్జునరావు, జి.కృష్ణయ్య, ఎం.అప్పారావు, ఆంజనేయశాస్త్రి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments