గవాయ్ పై దాడి ఘటన మీద కేసు ఎందుకు నమోదు చేయడం లేదు.
నవంబర్ 1 న హైదరాబాద్ లో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.
హసన్ పర్తి,అక్టోబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):
దేశ రాజధానిలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఇంకా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఎన్నో కేసులను సుమోటో గా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు,న్యాయవ్యవస్థకు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కనిపించడం లేదా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు.హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఎంఆర్ పిఎస్ అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎంఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు.ఈ దాడి జరిగి 12 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అందుకే గవాయి పై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని తెలిపారు. గవాయ్ పైన జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని కానీ 12 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదు కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని చీఫ్ జస్టిస్ పై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1 న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ,ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నాయకులు బొడ్డు దయాకర్ మాదిగ,బోర్ర బిక్షపతి మాదిగ,బుర్రి సతీష్ మాదిగ,మంద రాజు మాదిగ,జెపి లత మాదిగ ,పుల్ల శ్రీనివాస్,వెంకటరత్నం మాదిగ,ఎంఎస్పి జాతీయ నేత మంద కుమార్,ఎంఎస్పి సీనియర్ నాయకులు పుట్ట రవి మాదిగ,విహెచ్ పిఎస్ నాయకులు గోపాలరావు,ఎంఎస్పి సీనియర్ నాయకుడు ఆరెపల్లి పవన్ మాదిగ,ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు రాజారపు భిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments