డాక్టర్లు ఉన్నా… ఆశా వర్కర్లే వైద్యులు!
మేడ్చల్/మల్కాజిగిరి,నవంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉన్నా వైద్య సేవలు మాత్రం ఆశా వర్కర్ల చేతుల్లో నడుస్తున్నాయి. జీవనరక్షక బాధ్యతలు నిర్వర్తించే వైద్యులు పక్కకు తప్పుకుని, తగిన శిక్షణ లేని ఆశా వర్కర్లపై బాధ్యతలు నెట్టేసిన దృశ్యాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇంజక్షన్లు ఇవ్వడం, బ్లడ్ టెస్టులు చేయించడం, ఓపీ రాయడం, ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి పనులను ఆశా వర్కర్లతో చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులు వారిని బెదిరించి పనిచేయిస్తున్నారని కూడా మాటలు వినిపిస్తున్నాయి.
ఆశా వర్కర్ల అసలు బాధ్యతలు ప్రజారోగ్య అవగాహన, గర్భిణుల పర్యవేక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, టీకా కార్యక్రమాల్లో సహకారం వరకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు వారు మందులు రాయడం, రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం వంటి పనులు చేయాల్సి వస్తుండటం తీవ్రమైన ఆందోళనకు దారితీస్తోంది.
ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ...“ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆరోగ్య అవగాహన కోసం నియమించింది, కానీ ఇప్పుడు వారినే వైద్యుల్లా వాడుకుంటున్నారు. రోగుల ప్రాణాలు ముప్పులో పడే అవకాశం ఉంది” అని అన్నారు.
వైద్య నిపుణులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఆశా వర్కర్లకు వైద్య శిక్షణ లేదు. ఈ విధంగా పనులు అప్పగించడం ప్రమాదకరం. డాక్టర్ల కొరత కారణంగా ప్రాణాలకు ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలి” అని వ్యాఖ్యానిస్తున్నారు.
“డాక్టర్ల కొరతను భర్తీ చేయండి. ఆశా వర్కర్లను వారి అసలు సేవలకే పరిమితం చేయండి”అని ప్రజలు కోరుతున్నారు.


Comments