కామ్రేడ్ రామారావు హత్యపై సిపిఎం ఆగ్రహం.!
సమగ్ర విచారణ చేయాలని డిమాండ్.
సత్తుపల్లి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
కామ్రేడ్ సామినేని రామారావు హత్య సంఘటనపై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరిపి, నిజమైన దోషులను అరెస్ట్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణ పాతసెంటర్ నుండి బస్టాండ్ చౌరస్తా వరకు నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు మాట్లాడారు. ఇటీవల జరిగిన రామారావు హత్యలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు అన్నారు. హత్యలో ప్రమేయం ఉన్న వారిని, అలాగే కుట్ర పన్నిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకూడదు. నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు చెప్పారు. ప్రజా పాలన అని చెబుతున్న మంత్రి భట్టి విక్రమార్క ఈ కేసుపై స్పష్టమైన వైఖరి ప్రకటించి, విచారణ వేగవంతం చేసేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
నేటి కాంగ్రెస్ పాలనలో ప్రత్యర్థులపై రాజకీయంగా దాడులు పెరగడం ఆందోళనకరమని, కమ్యూనిస్టులు చూడచూడలా ఉండబోమని సిపిఎం నాయకులు హెచ్చరించారు.
నిరసనలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, రావుల రాజబాబు, బుచ్చయ్య, చావా రమేష్, ఎస్కే వలి, భాస్కర్, జిలాని, సైదా, రాము, కావూరి వెంకటేశ్వరరావు, కోటయ్య, అర్జున్, భాష, మీరాజ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments