పాఠశాల భవనంలోనే ఆరోగ్య ఉపకేంద్రం
స్వంత భవనం నిర్మించాలంటూ మల్లికుదుర్ల ప్రజల ఆవేదన
వేలేరు,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం దయనీయ పరిస్థితుల్లో కొనసాగుతోంది. సోడాషాపల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్ గ్రామాలకు ఒకటే ఉపకేంద్రంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ స్వంత భవనం లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
తాత్కాలికంగా పాఠశాల భవనంలోనే ఈ కేంద్రం నడుస్తుండటంతో విద్యార్థులు, రోగులు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో నీటిచొరబాటు, దుమ్ము, మురికి వాతావరణం కారణంగా ఆరోగ్య కేంద్రం వద్ద రోగులు చికిత్స పొందడం కష్టంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.
మల్లికుదుర్ల, సోడాషాపల్లి, గుండ్లసాగర్ గ్రామాల ప్రజలు ఈ ఉపకేంద్రానికి శాశ్వత భవనం నిర్మించి, తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. “మన ఆరోగ్యానికి ఇది ప్రాధమిక అవసరం… ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలి” అని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.


Comments