పెద్దమందడిలో బాలల పరిరక్షణపై అవగాహన సమావేశం
పెద్దమందడి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మండల బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లాలోని బాలల హక్కుల రక్షణ, సంక్షేమంపై పనిచేస్తున్న అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది హాజరయ్యారు.
సభలో ఎంపీడీవో పరిణత ప్రసంగిస్తూ..బాల్య వివాహ నిరోధక చట్టం – 2006, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించాల్సిన అవసరం, మరియు సంక్షోభంలో ఉన్న పిల్లలకు బాల రక్ష భవన్ అందిస్తున్న సేవలు గురించి వివరించారు. అలాగే అత్యవసర సమయాల్లో సహాయం కోసం వినియోగించాల్సిన ఫోన్ నంబర్లు 100, 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) మరియు 112 గురించి అవగాహన కల్పించారు.
సభలో అధికారులు పేర్కొన్నారు, పిల్లల రక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని. ఈ సమావేశం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పాండు నాయక్, ఎంఈఓ మంజులత, ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ మోహన్ రాజా, మెడికల్ ఆఫీసర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పి. సుధా, నాగరాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి నరేష్, బాలరాజు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.


Comments