మిత్రుని కష్టసమయంలో తోడుగా నిలిచిన పదవ తరగతి స్నేహితులు
పెద్దమందడ,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామానికి చెందిన పదవ సత్యనారాయణ ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో (1997- 1998)బ్యాచ్ కలిసి చదువుకున్న తోటి స్నేహితులు విషయం తెలిసిన వెంటనే స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ... మిత్రుడు జీవిత పోరాటంలో నిలబడేందుకు అండగా ఉండాలనే భావనతో, పదవ తరగతి క్లాస్‌మేట్స్ అందరూ ఒక చోట చేరి సహాయం చేయాలని నిర్ణయించారు.
ఆ నిర్ణయంతో తక్షణమే ప్రతి ఒక్కరు తమవంతు సహాయాన్ని అందిస్తూ, మొత్తం రూ.93,000/-రూపాయల మొత్తాన్ని సేకరించారు. ఆ మొత్తాన్ని బాధితుడైన సత్యనారాయణ భార్యకు వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంలో స్నేహితులు మాట్లాడుతూ ..మనలో ఎవరికైనా ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనమందరం కలసి సహాయం చేసుకోవాలి, అదే నిజమైన మానవత్వం, అదే నిజమైన స్నేహం” అని తెలిపారు.
పదవ తరగతి రోజుల నుండి ఒకే బంధంతో కొనసాగుతున్న ఈ స్నేహితులు సత్యనారాయణ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలాగే ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ మనస్పూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ద్వారా స్నేహితుల మధ్య మానవతా విలువలు, పరస్పర సహకారం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పబడింది.
గ్రామ ప్రజలు, స్థానికులు కూడా క్లాస్‌మేట్స్ చేసిన ఈ మంచి పనిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాణిక్ వర్మ, ధనుంజయ, చందు రెడ్డి, శివకుమార్, బాలనాగి, సత్యనారాయణ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.


Comments