సైనిక్ పూరిలో పూలే వర్ధంతి.. సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన స్ఫూర్తి గ్రూప్
ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సైనిక్పురి చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించిన ఈకార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు కోమటి రవి మాట్లాడుతూ, అట్టడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య అందించేందుకు పూలే నిర్మించిన విద్యాసంస్థలు వేలాది మంది జీవితాలను మార్చాయని గుర్తుచేశారు. మనువాదం కారణంగా మహిళలు, శూద్రులకు విద్య దూరమైన సమయంలో తన భార్యకు విద్య నేర్పి, దళిత బాలికలకు బోధించేలా చేసిన పూలే కృషి చారిత్రాత్మకమని అన్నారు. వారి సేవలను అడ్డుకునేందుకు అప్పటి బ్రాహ్మణీయ భావజాలం గల వర్గాలు ప్రతిఘటన చేసినప్పటికీ, పూలే వెనుదిరగలేదని తెలిపారు.అధ్యక్షుడు గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ పూలే చేసిన సామాజిక సేవలను నేటికీ కొందరు మనువాదులు మరుగునపర్చడానికి ప్రయత్నించినా, వారి ఆలోచనలు ప్రజల్లో ఉద్యమంగా కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ, మనువాద భావజాలంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ నిచ్చెన మెట్ల సంస్కృతిని తెరపైకి తేవాలనే కుట్రలు చేస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ రోజు శనివారం సాయంత్రం 6 గంటలకు కమలనగర్ సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలందరూ కుటుంబసమేతంగా హాజరై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.కార్యక్రమంలో పులే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ నాయకులు పి. మల్లేశం, ఎం. భాస్కర్ రావు, సామాజిక ఉద్యమ నాయకులు జి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments