ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
టీబీఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే
వేడుకగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం
తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీబీఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని రామకృష్ణపూర్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్, విశ్రాంత కార్మికులు లక్కాకుల రాజయ్య,బాబురావులను ఘనంగా సత్కరించారు. అనంతరం టీబీఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, కుటుంబ సంక్షేమానికి సర్వశక్తులు ధారపోసి తుది దశలో వృద్ధులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, కన్న బిడ్డలు వారిని సరిగ్గా పట్టించుకోవడంలేదని, కన్న బిడ్డలు, సమీప బంధువులు వృద్దులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు వృద్ధుల్లో ఒకరు శారీరక, మానసిక,ఆర్థిక, లైంగిక వేధింపులకు గురి అవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, తద్వారా దేశాభివృద్ధి సైతం కొంటుపడుతుందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అందుకోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలన్నారు. దీంతోపాటు సరైన వైద్య చికిత్సలు, కౌన్సిలింగ్ అందించడంపై పాలకులు దృష్టి సారించాలని, ప్రధానంగా వృద్ధుల కోసం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత కొమ్ము శ్రీనివాస్, సంఘం జిల్లా సభ్యులు మాడుగుల కుమార్, లవ కుమార్, వలస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments