అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు
*కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమై.. హరీష్ రావు తో తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారు *కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో చేశాం * ఈ ఐదేళ్లలో ఆదర్శంగా నిలుపుతాం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలే కావస్తున్నా.. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని..గతంలో బీఆర్ ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి విమర్శించారు. శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల రుణమాఫీ ని అమలు చేశామని, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి.. తదితర ఆరు గ్యారెంటీల ద్వారా పేదలకు లబ్ధి కలిగిస్తున్నామని అన్నారు. రూ.వేలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి..ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
*హరీష్ కు లెక్కలు తెలియవేమో..*
సీతారామ ప్రాజెక్ట్ ను 90 శాతం తామే పూర్తి చేశామని హరీష్ రావు అంటున్నారని.. రూ.19 వేల కోట్ల వ్యయ ప్రణాళికలో ఆ ప్రభుత్వం కేవలం రూ.7వేల కోట్లే వెచ్చించిందని ఎంపీ రఘురామిరెడ్డి తెలిపారు. వారు 39 శాతమే కట్టించారనే కనీస జ్ఞానం లేకుండా పోయిందని, గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ కు లెక్కలు కూడా తెలియవా..? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారని, హరీష్ రావు ద్వారా తప్పుడు విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. రైతులందరి రుణాలు మాఫీ చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సిసలైన రైతు బంధువు, రైతు మిత్రుడు అని ఎంపీ కొనియాడారు.
*కేంద్ర బడ్జెట్లో తీరని అన్యాయం..*
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు రీ ఆర్గనైజేషన్ కింద నిధులు ఇవ్వాల్సి ఉండగా దానిని కేంద్రం విస్మరించింది అని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. నిర్మలా సీతారామన్ రీ ఆర్గనైజేషన్ స్కీం కింద వివిధ నిధులను ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ప్రకటించి.. మనకు అన్యాయం చేశారని తెలిపారు. అనంతరం ఎంపీ రఘురాం రెడ్డిని.. ఘనంగా సత్కరించారు.
*ఈ కార్యక్రమంలో..* రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, సీనియర్ నాయకులు మట్టా దయానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కొప్పుల చంద్రశేఖర్, ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Comments