మేమున్నామని మీకేం కాదనే ధైర్యం ఇవ్వండి...!
- పాలేరు నియోజకవర్గంలో సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి
- ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులతో కలిసి సమన్వయం చేయండి
- తన అభిమానులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
నమస్కారం నేను మీ పొంగులేటి శీనన్నను. పాలేరు నియోజకవర్గ ప్రజల దయనీయ పరిస్థితిని
చూసి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి దీనస్థితి ఏర్పడుతుందని కలలో కూడా నేను ఊహించలేదు. తుఫాను ప్రభావంతో మిగిలిన ప్రాంతాలలాగానే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం కూడా అతలాకుతలమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో, తండాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వరదల్లో చిక్కుకుని బయటకు రాలేని వారు ఉన్నారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకునిపోతుండగా ఒకరిని రక్షించడం జరిగింది. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ కి కూడా వాతావరణం సహకరించడం లేదు. ఎప్పటికప్పుడు జిల్లా, నియోజకవర్గ, మండలాధికారులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు కావాల్సిందిల్లా పాలేరు నియోజకవర్గ ప్రజానీకానికి మేమున్నాం అనే ధైర్యం. నా ప్రతినిధులుగా నా అభిమానులందరూ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. స్థానిక అధికారులు, సిబ్బందితో కలిసి ప్రజలకు కావాల్సిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి. ఆహార పానీయాలను అందించండి. వర్షాల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేయించే ప్రయత్నం చేయండి. అధికారులు, సిబ్బంది ఇందుకు సంబంధించిన చర్యలు చేపడుతూనే ఉన్నప్పటికీ మీ వంతుగా శీనన్న అభిమానులుగా తోడ్పాటు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆదివారం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.


Comments