సాంకేతికతకు ఆధ్యుడు రాజీవ్ గాంధీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
భారతదేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి బీజం వేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన నివాసంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,సూది మొన కూడా తయారు కాని భారతదేశంలో,సాంకేతికతను పరిచయం చేసి ప్రస్తుతం అంతరిక్షంలోకి పంపించే రాకెట్లను సైతం తయారు చేసే దిశగా బీజాలు వేసిందని,అప్పట్లో బీడు భూములు ఉన్నచోట ప్రాజెక్టులు కట్టించి సాగుభూములుగా మార్చి వ్యవసాయోగ్యంగా మార్చిన ఘనత రాజీవ్ కుటుంబానిదేనని అన్నారు. దేశంలో ఐదు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చి సమూల మార్పులు చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చిన ఘనత గాంధీ కుటుంబాని దేనిని తెలిపారు.యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత రాజీవ్ గాంధీ కుటుంబానిదేనని చెప్పారు. దేశానికి అవసరమైన సమయంలో ఆర్థికపరంగా మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా తెలంగాణను ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని తెలిపారు. కెసిఆర్ అసెంబ్లీలో సోనియా గాంధీని పొగుడుతారని,వారి పార్టీ మిగతావాళ్లు గాంధీ కుటుంబ సభ్యుల గురించి విమర్శిస్తారని,ఇది ఎక్కడి సంప్రదాయమని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందని, ఆయన పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా తామందరము గెలిచామని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే అయినా కూడా అందరి మద్దతుతోనే గెలిచానని,నాయకులు కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరు పార్టీకి అవసరమని,అందరం సమిష్టిగా కలిసి వెనుకబడిన మక్తల్ నియోజకవర్గంను అభివృద్ధి చేసుకుందామని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బోయ రవికుమార్, సీనియర్ నేతలు చంద్రకాంత్ గౌడ్, గొల్లపల్లి నారాయణ, వల్లంపల్లి లక్ష్మణ్, మందుల నరేందర్, కున్షి నాగేందర్, కట్టా వెంకటేష్ , నగేశ్, బోయ వెంకటేష్ ,నూరుద్దీన్, అబ్దుల్ రెహమాన్, శంషుద్దీన్, లాలా ,కావలి రాజేందర్, చందాపూర్ వెంకట్ రాములు, వాకిటి హనుమంతు , సత్యారం రవి, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments